నెల్లూరుజిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల రగడ ఇంకా కొలిక్కిరాలేదు. ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికే మళ్లీ అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తుండగా తనకే అవకాశం కల్పించాలని నియోజకవర్గ టిడిపి నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పట్టుబడుతున్నారు. నియోజకవర్గంలోని నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో మొదటి నుండి ఇక్కడ వివాదంగానే ఉంది. కోవూరు నుండి తన పోటీ ఖాయమని పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. నిన్న జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బ్యాలెట్ పేపర్ పై తన పేరు ఉంటుందని ఆయన బహిరంగంగా ప్రకటించడంతో పార్టీ నేేతలు ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర ఆదివారం ఉదయం కోవూరులోని పెళ్లకూరు నివాసానికి వెళ్లి మాట్లాడారు. సుమారు గంట పాటూ పెళ్లకూరును బుజ్జగించే ప్రయత్నం చేశారు.

అయితే టికెట్టు తనకే ఇవ్వాలని ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని పెళ్లకూరు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈనెల 14న అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి కలవాలని సూచించారు. ఈ భేటీ తర్వాత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2014 ఎన్నికల్లో కోవూరు టిడిపి టికెట్ తనదేనని అయితే చివరి క్షణంలో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి త్యాగం చేశానని వివరించారు. ఆ సమయంలో పోలంరెడ్డి ఈ దఫా తనకు అవకాశం ఇవ్వాలని 2019లో పెళ్లకూరుకే టికెట్ ఇచ్చేందకు తనకు అభ్యంతరం లేదని చెప్పినట్లు వెల్లడించారు. పోలంరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కోవూరు నుండి పోటీ చేయడం ఖాయమని మరోమారు స్పష్టం చేశారు. 14వ తేదీ ముఖ్యమంత్రి తో భేటీ తర్వాత 15వ తేదీనా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తెలియజేశారు. అవసరమైతే సరికొత్త రాజకీయాలతో ప్రజల్లోకి వెళ్తానని వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

అయితే సర్వే ల ప్రకారం కోవూరు నుంచి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి కి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు అధిష్టానం దగ్గర సమాచారం ఉన్నందు వలన పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారికే టికెట్టు వస్తుంది అని ఆశిస్తున్నారు.