మజ్ను టైటిల్‌ మా అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిందనీ మిస్టర్‌ మజ్ను కథానాయకుడు, అక్కినేని అఖిల్‌ అన్నారు. మిష్టర్‌ మజ్ను చిత్ర యూనిట్‌ బుధవారం నగరంలో సందడి చేసింది. శ్రీ వేంకటేశ్వర సినీచిత్ర బ్యానర్‌పై అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన మిస్టర్‌ మజ్నుని ప్రేక్షకులు ఆదరించిన సందర్భంగా చిత్రయూనిట్‌ సక్సెస్‌ టూర్‌ చేస్తోంది. అందులో భాగంగా హీరో అఖిల్, హీరోయిన్‌ నిధి అగర్వాల్, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, దర్శకుడు అట్లూరి వెంకట్, కమెడియన్‌ ఆదిలు నగరానికి విచ్చేసి  గాంధీనగర్‌లోని శైలజ థియేటర్‌లో ప్రేక్షకులను కలుసుకున్నారు. అనంతరం మహాత్మాగాంధీరోడ్డులోని ఫార్చ్యూన్‌ మురళీపార్క్‌లో నిర్వహించి విలేకరుల సమావేశంలో అఖిల్‌ మాట్లాడుతూ తన తండ్రి నాగార్జున నటించిన మజ్ను టైటిల్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. డైరెక్టర్‌ అట్లూరి వెంకట్‌ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నట్లు తెలిపారు. నిర్మాత ప్రసాద్‌ మాట్లాడుతూ మా బ్యానర్‌ నుంచి వచ్చిన మంచి రొమాంటిక్‌ హిట్‌ మూవీ మిస్టర్‌ మజ్నుగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో కామాక్షి ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్, నాగార్జున ష్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులు సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో అఖిల్‌కు అభిమానులు సన్మానం చేశారు.