రాజధాని వార్తలు

దుర్గగుడిలో రాహు-కేతు పూజలు

విజయవాడ. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో నూతన ఆర్జిత సేవగా రాహు-కేతు పూజలను బుధవారం ప్రారంభించారు. ముందుగా ఆలయ వేదపండితులు ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు గణపతి పూజ నిర్వహించారు. రాహు-కేతు విగ్రహాల పంచలోహ శోధన నిమిత్తం యాగం నిర్వహించారు. రాహుకాలం ప్రవేశించగానే తొలిసారిగా ప్రయోగాత్మకంగా రాహు-కేతు పూజలు ప్రారంభించారు. ఈపూజల్లో కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం దంపతులు, సీపీ ద్వారకా తిరుమలరావు, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ సతీమణి పాపిత, దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు, పాలక మండలి సభ్యులతోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. వేదపండితులు రాహు-కేతు పూజల విశిష్టతను వివరిస్తూ శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు.

పూజాభిషేకాలు నిర్వహించేందుకు సౌకర్యంగా ఉండేలా శాశ్వత ప్రాతిపదికన రాతి నాగ పడగలు, స్టెయిన్‌లెస్‌ స్టీలుతో ప్రత్యేకమైన గ్రహ ఆసనాలు (పీటలు) తయారు చేయించారు. మూడు రోజులపాటు రాహు-కేతు పూజలను ప్రయోగాత్మకంగానే నిర్వహించి ఈ నెల 9వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. రాహు-కేతువులకు అధిష్టానదేవత అయిన దుర్గమ్మ సన్నిధిలో శక్తిమంతమైన రాహు-కేతు పూజలను కూడా ప్రవేశపెడితే భక్తులకు కాల సర్ప, కుజదోషాలు తొలగిపోయి వివాహ, సంతాన ప్రాప్తి తదితర అభీష్టాలు నెరవేరతాయని వేదపండితులు తెలిపారు. దుర్గగుడిలో కొత్తగా ప్రారంభించిన రాహు-కేతు పూజలకు టిక్కెట్టు రూ. 1116గా నిర్ణయుంచారు. ఈ పూజలు చేయించుకునేవారికి పూజా సామగ్రి, ప్రసాదాలను అందించడంతో పాటు పూజ పూర్తయిన తర్వాత ఇద్దరిని అమ్మవారికి దర్శన భాగ్యం కల్పించనున్నారు