కోల్‌కతాకు మరో 10 మంది సీబీఐ అధికారులు..

రోజ్‌ వ్యాలీ, శారదా పోంజీ వంటి చిట్‌ఫండ్‌ కుంభకోణాల్లో విచారణ జరిపేందుకుగానూ కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) తమ దిల్లీ, భోపాల్‌, లఖ్‌నవూల్లోని కార్యాలయాల నుంచి మరో 10 మంది అధికారులను పశ్చిమ బెంగాల్‌కు పంపనుంది. ఫిబ్రవరి 20 వరకు వీరు ఆ విచారణను కొనసాగించడంలో తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ కుంభకోణాల కేసుల్లో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌తో పాటు మరి కొందరు ఉన్నతస్థాయి వ్యక్తులను ప్రశ్నించే అవకాశం ఉండడంతో అదనంగా కొందరు అధికారులను రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్న సీబీఐ ఈ మేరకు వారిని కోల్‌కతాకు పంపుతోంది. ఈ అదనపు బృందంలో.. న్యూదిల్లీకి చెందిన ఎస్పీ సిన్హా, అదనపు ఎస్పీ వీఎం మిట్టల్‌, ఇతర అధికారులు సురేంద్ర కుమార్‌ మాలిక్‌, చందర్‌ దీప్‌, అటుల్‌ హజేలా, అలోక్‌ కుమార్ సాహి‌, పీకే శ్రీవాత్సవ, హరిశంకర్‌ చంద్, రితేశ్‌ దంహి, సురజిత్‌ దాస్‌ ఉన్నారు.
ఈ అధికారులు తాత్కాలికంగా కోల్‌కతా సీబీఐతో కలిసి పనిచేస్తారని ఓ సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు. శుక్రవారం వీరంతా కోల్‌కతాకు చేరుకుంటారని చెప్పారు. రాజీవ్‌ కుమార్‌ ఫలానా తేదీన విచారణకు రావాలని నోటీసు చేసే విషయంపై అధికారులు ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా, ‌కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌.. సీబీఐ విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే, ఆయనను అరెస్టు చేయొద్దని కూడా సీబీఐకి సూచించింది. ఇటీవల ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *