35 ఏళ్ల మేరీ కోమ్ ప్రపంచ రికార్డు సృష్టించింది

35 ఏళ్ల మేరీ కోమ్ ప్రపంచ రికార్డు సృష్టించింది

న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత దిగ్గజ మహిళా బాక్సర్, మణిపురి మాణిక్యం, 35 ఏళ్ల మేరీ కోమ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. శనివారం ఇక్కడ జరిగిన ఏఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో మేరీ కోమ్ ఖాతాలో ఆరో స్వర్ణం జమ అయింది. 2010లో బార్బడోస్‌లోని బ్రిడ్జిటౌన్‌లో 48 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆఖరిసారిగా గోల్డ్‌మెడల్ అందుకున్న మేరీ కోమ్ మళ్లీ ఏడేళ్ల తర్వాత మరో బంగారు పతకాన్ని ముద్దాడింది. అంతకుముందు 2002, 2005, 2006, 2008, 2010 సంవత్సరాల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లలో ఐదుసార్లు బంగారు పతకాలను అందుకుంది. శనివారం 48 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్ పోరులో ఉక్రెయిన్‌కు చెందిన బాక్సర్ హన్నా ఒఖోటాపై 5-0తో ఘన విజయం సాధించింది. ఫైనల్ పోరులో ప్రత్యర్థి నుంచి
ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో మేరీ కోమ్ అతి సునాయాసంగా గెలుపొందింది. ఏకపక్షంగా జరిగిన పోరులో మేరీ కోమ్ ప్రత్యర్థిపై 30-27, 29-28, 29-28, 30-27, 30-27 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఏడాది పోలాండ్‌లో జరిగిన ఒక టోర్నమెంట్‌లో ఇదే ప్రత్యర్థిని మేరీ కోమ్ ఓడించడం గమనార్హం. ప్రపంచ బాక్సింగ్‌లో ఆరుసార్లు గోల్డ్‌మెడల్స్ సాధించడంతో ఇంతవరకు ఐదుసార్లు గోల్డ్‌మెడల్స్, ఒకసారి కాంస్య పతకం అందుకున్న ఐర్లాండ్ బాక్సర్ కటీ టేలర్‌ను అధిగమించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇపుడు ఆరోసారి గోల్డ్ మెడల్‌ను అందుకోవడంతో ఇంతవరకు పురుషులు, మహిళల విభాగాల్లో అత్యధిక మెడల్స్ సాధించిన క్యూబా పురుషుల దిగ్గజ బాక్సర్ ఫెలిక్స్ సవొన్ (1986-1989 మధ్యకాలంలో ఒలింపిక్‌లో మూడు గోల్డ్‌మెడల్స్‌తోపాటు మొత్తం ఆరు గోల్డ్‌మెడల్స్, ఒక రజత పతకం) సరసన మేరీ కోమ్ చోటుదక్కించుకుంది. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన మేరీ కోమ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరంగేట్రం చేసిన సీజన్ 2001లో రజత పతకం గెల్చుకుంది.
అభినందనల వెల్లువ
ఆరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని అందుకున్న మేరీ కోమ్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. భారత క్రీడా చరిత్రలోనే ఇది అద్భుతమైన ఘట్టమని, యావత్ దేశం మేరీ కోమ్ సాధించిన విజయానికి గర్విస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయాలను నమోదు చేస్తున్న ఆమె ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని ట్వీట్ చేశారు. ‘ఈ విజయానికి ఓ ప్రత్యేకత ఉంది’ అన్నారు.
చిత్రం..ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరవ స్వర్ణ పతకాన్ని సాధించిన అనంతరం
భావోద్వేగానికి గురైన మేరీ కోమ్

courtesy by : andhra bhoomi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *