ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మోసం చేశారు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్టని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి హామీ ఇచ్చి అమలు చేయలేదని కేజ్రీవాల్ విమర్శించారు. నరేంద్రమోదీ ఒక పార్టీకి కాదు.. దేశానికి ప్రధాని అన్న విషయం మర్చిపోయారన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటానికి ఆప్ మద్దతు ఇస్తుందన్నారు. హక్కుల కోసం పోరాడితే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

కాగా ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాటదీక్షకు జాతీయ నేతలు సంఘీభావం తెలిపారు. మన్మోహన్ సింగ్, రాహుల్, ములాయం, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ఒబ్రెయిన్, తిరుచ్చి శివల తదితరులు సంఘీభావం ప్రకటిస్తూ.. చంద్రబాబుకి అండగా ఉంటామన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై నేతలు మోదీని నిలదీశారు. చంద్రబాబు పోరాటానికి జాతీయస్థాయిలో మద్దతు ఉంటుందన్నారు. మోదీని గద్దె దించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జాతీయనేతల ప్రసంగాలు ఆయా పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.