నిండు గర్భిణికి చేయూతనందించిన ఆర్మీ

శ్రీనగర్: మంచు వర్షంలో చిక్కుకుపోయిన ఓ నిండు గర్భిణికి ఇండియన్ ఆర్మీ సాయమందించింది. అనంతరం హాస్పిటల్‌లో చేర్పించిన ఆమెకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారని వైద్యులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని బండిపూర్ జిల్లాలో జరిగిందీ సంఘటన.

శుక్రవారం 8న బండిపూర్ ఆర్మీ క్యాంపుకు ఓ గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. తాము మంచు వర్షంలో చిక్కుకుపోయామని, ఎటూ కదలలేని స్థితిలో ఉన్నామని ఓ వ్యక్తి ఆర్మీ అధికారులకు ఫోన్‌లో వివరించాడు. తన భార్య గుల్షానా బేగం నిండు గర్భవతని, ప్రస్తుతం హాస్పిటల్‌కు వెళ్తుండగా మంచు వర్షంలో చిక్కుకున్నామని తమకు సాయం అందించాలని ఆర్మీతో వేడుకున్నాడు.

దీనికి వెంటనే స్పందించిన ఆర్మీ సిబ్బంది, సదరు ప్రదేశానికి వెళ్లారు. అయితే అక్కడ నుంచి సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లే దారి మొత్తం మంచుతో నిండిపోయింది. వాహనం కదిలే పరిస్థితి లేదు. దీంతో గర్భిణిని ఒక స్టెచర్ కొంత దూరం మోసుకెళ్లి అక్కడి నుంచి ఆర్మీ అంబులెన్సులో హస్పిటల్‌కు తరలించారు ఆర్మీ బృందం. అనంతరం కొద్ది సమయానికే ఇద్దరు కవలలు పుట్టినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి