రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులతో పోలిస్తే 2.86 శాతం తక్కువ ధరకు మోదీ సర్కారు ఒప్పందం కదుర్చుకున్నట్టు కాగ్‌ వెల్లడించింది. బుధవారం రాజ్యసభకు సమర్పించిన 141 పేజీల నివేదికలో ఈ మేరకు పేర్కొంది. 2007, 2015 కొనుగోలు ఒప్పందాలను పోల్చిచూసినట్టు కాగ్‌ తెలిపింది. రఫేల్‌ యుద్ధవిమానాల కోసం గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కారు జరిపిన సంప్రదింపుల్లో బేస్‌ ధరలో ఎటువంటి మార్పులేదని తేల్చింది.

ప్రస్తుత ఒప్పందం ప్రకారం సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఆపరేషనల్ సపోర్ట్ నిర్వహణ 4.77 శాతం తగ్గింది. భారత అవసరాలకు తగినట్లు సాంకేతిక మార్పులు చేయడంలో 17.08 శాతం తగ్గుదల కనిపించింది. ఇంజినీరింగ్ సపోర్ట్ ప్యాకేజీ 6.54 శాతం పెరిగింది. పనితీరు ఆధారిత విషయంలో 6.54 శాతం మెరుగుపడింది. టూల్స్, టెస్టర్స్, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్‌లో 0.15 శాతం పెరిగింది. ఆయుధాల ప్యాకేజీలో 1.05 శాతం తగ్గుదల నమోదైంది. పైలట్, సాంకేతిక నిపుణుల శిక్షణ వ్యయం 2.68 శాతం పెరిగిందని కాగ్‌ వివరించింది. అయితే ధరల వివరాలు వెల్లడించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సత్యం గెలిచింది: బీజేపీ
కాగ్‌ నివేదికపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సత్యం గెలిచిందని, ప్రతిపక్షాల కుట్రలు బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఇకలైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. బీజేపీ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని పేర్కొన్నారు.