పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పలువురికి  సోషల్‌ మీడియాలో వేధింపులు

ప్రముఖ జర్నలిస్టు  బర్ఖా దత్‌కు తీవ్ర వేధింపులు, బెదిరింపులు

వేధింపులపై ఫిర్యాదు చేస్తే..బర్ఖాదత్‌కు ట్విటర్‌ వార్నింగ్‌

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్‌ పలురకాల బెదిరింపులకు తోడు లైంగిక వేధింపులకు గురయ్యారు. అసభ్య సందేశాలు, తీవ్ర అభ్యంతరకరమైన ఫొటోను ఫార్వర్డ్ చేయడంతో పాటు ఆమె ఫోన్ నంబర్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. కాల్స్‌, వీడియో కాల్స్ చేస్తూ.. చంపేస్తామంటూ తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులపై విసుగెత్తి, సహనం నశించి వివరాలను బహిర్గతం చేయడం తప్పడం లేదంటూ ఆయా వ్యక్తుల ఫోన్‌ నెంబర్లను ఆమె ట్విటర్‌లో  పోస్ట్ చేశారు.  అలాగే వేధింపులపై సంబంధిత పోలీసు అధికారులతోపాటు, ట్విటర్‌కు కూడా బర్ఖా ఫిర్యాదు చేశారు.

అయితే దీనిపై ట్విటర్‌ ప్రతికూలంగా స్పందించింది. వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలకు బదులుగా.. ఫోన్‌ నెంబర్లు షేర్‌ చేయడాన్ని తప్పుబడుతూ.. ఇకపై ఇలా చేస్తే.. మీ ట్విటర్‌ ఖాతాను తొలగిస్తామంటూ ఈ మెయిల్‌ సమాచారాన్ని పంపింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బర్ఖాదత్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. నిందితులపై చర్యలకు బదులుగా వారికి వత్తాసు పలకడం అవమానకరమైన చర్యగా  పేర్కొన్నారు. దీనిపై  ట్విటర్‌పై  న్యాయపోరాటానికి తాను సిద్ధపడుతున్నట్టు వెల్లడించారు.

మరోవైపు వేధింపులపై ఫిర్యాదు చేస్తే.. హెచ్చరికలా అంటూ ట్విటర్‌ వ్యవహారశైలిపై దుమారం రేగింది. ట్విటర్‌ వేదికగా వేధింపులు, హింస పెరిగిపోతోందని, దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానించారు. బర్ఖాదత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మరో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్‌ బర్ఖాదత్‌ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వాట్సాప్‌ కమ్యూనికేషన్‌ హెడ్‌ కార్ల్‌ వూగ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

కాగా, పుల్వామా దాడి జరిగినప్పటి నుంచీ దేశంలోని జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు వేధింపులెదుర్కొన్నారు. రావిశ్‌ కుమార్‌, స్వాతి చతుర్వేతి, అభిసార్ శర్మతోపాటు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ ఈ కోవలో ఉన్నారు. వీరంతా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తనకు వందలాది కాల్స్‌, సందేశాలతో పాటు, బెదరింపులు ఎదురయ్యాయంటూ మరో సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ట్వీట్‌ చేశారుterm=Pulwama”>పుల్వామా దాడి నేపథ్యంలో కశ్మీరీ యువకులను తీవ్రవాదులుగా ముద్రవేయడంపై నిరసన తెలిపినందుకుగాను చాలామంది జర్నలిస్టులు, విద్యార్థినులు, ఇతర మీడియా ప్రతినిధులను టార్గెట్‌ చేస్తూ సోషల్‌మీడియా వేదికగా వేధింపులు, బెదిరింపులు తీవ్రమయ్యాయి.