హామిల్టన్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ పరుగుల మోత మోగించింది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 715 పరుగుల చేసి డిక్లేర్డ్‌ చేసింది. జీతన్‌ రావల్‌(132), టామ్‌ లాథమ్‌(161)లు సెంచరీలతో కదం తొక్కగా, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(200 నాటౌట్‌) డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇక హెన్రీ నికోలస్‌(53), గ్రాండ్ హోమ్‌(76 నాటౌట్‌)లు హాఫ్‌ సెంచరీలు చేయగా, వాగ్నెర్‌(47) రాణించాడు. ఫలితంగా ఏడు వందలకు పైగా స్కోరు నమోదు చేసింది. ఇది న్యూజిలాండ్‌ టెస్టు క్రికెట్‌లో అత్యధిక స్కోరుగా నమోదైంది.

451/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు విలియమ్సన్‌-వాగ‍్నర్‌లు సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. కాగా, 509 పరుగుల వద్ద వాగ్నర్‌ ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరినప్పటికీ విలియమ్సన్‌ మాత్రం అత్యంత నిలకడగా ఆడాడు. ఈ క్రమంలోనే 257 బంతుల్లో     19 ఫోర్లు సాయంతో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది విలియమ్సన్‌ కెరీర్‌లో రెండో ద్విశతకం. అటు తర్వాత రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇంకా బంగ్లాదేశ్‌ 307 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 234 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *