న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో ఘోర పరాజయం చెందడం పట్ల టీమిండియా కెప్టెన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఇంతటి ఘోర వైఫల్యాన్ని ఊహించలేదని పేర్కొన్న రోహిత్‌..  ఇదొక చెత్త ప్రదర్శన అని అన్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన రోహిత్‌.. ‘ సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌ చవి చూసిన అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇదొకటి. ప్రధానంగా బ్యాటింగ్‌లో ఘోరంగా వైఫల్యం చెందాం. ఈ తరహా ఆటను ఊహించలేదు. ఇక్కడ క్రెడిట్‌ అంతా న్యూజిలాండ్‌ బౌలర్లదే. వారు అద్భుతమైన బౌలింగ్‌తో మమ్మల్ని కట‍్టడి చేశారు.

ఇది మా జట్టుకు ఒక గుణపాఠం. ముఖ్యంగా స్వింగ్‌ అయ్యే పిచ్‌లపై బ్యాటింగ్‌ ఎలా చేయాలనేది మ్యాచ్‌ తర్వాత మా ఆటగాళ్లకు కచ్చితంగా బోధపడుతుంది. ఇక్కడ మమ్మల్ని నిందించుకోక తప్పదు. ఒత్తిడికి గురై వికెట్లను సమర్పించుకున్నాం. చెత్త షాట్ల ఎంపికతో కివీస్‌కు దాసోహమయ్యాం. ఒత్తిడికి లోను కాకుండా కనీసం పోరాటాన్ని కనబరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఆడటం అనేది ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. మమ్మల్ని మేము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ ఒక్క ఆటగాడు ఎక్కడ తప్పు చేశాడో అనే విషయాన్ని విశ్లేషించుకోవాలి’ అని రోహిత్‌ తెలిపాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *