సెంట్రాఫ్ఎట్రాక్షన్ గా హరీష్ రావు…నవ్వుతూ రాజ్ భవన్‌కు,కేటీఆర్ పక్కనే హరీష్.

హైదరాబాద్: మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. కేటీఆర్ పక్కనే కూర్చొని మంత్రుల ప్రమాణస్వీకారాన్ని హరీష్ రావు చూశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్‌భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముందుగానే కేబినెట్‌లో చోటు దక్కిన ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు ముందుగానే వచ్చారు.
మరికొన్ని క్షణాల్లోనే మంత్రుల ప్రమాణం చేసే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు రాజ్ భవన్ కు చేరుకొన్నారు. అప్పటికే అక్కడే ఉన్న కాబోయే మంత్రులు, పార్టీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో  హరీష్ రావు కరచాలనం చేశారు. గత టర్మ్ లో తనతో పాటు మంత్రులుగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటలను ఆలింగనం చేసుకొన్నారు.
ఆ తర్వాత ముందు వరుసలో కాకుండా వెనుక వరుసలో కూర్చొనేందుకు వెళ్లాడు. కొత్త మంత్రులుగా ప్రమాణం చేసే ఎమ్మెల్యేలు ముందు వరుసలో కూర్చొన్నారు.
అయితే వెనుక వరుసలో కూర్చొన్న కేటీఆర్ పక్కనే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూర్చొన్నారు.  లక్ష్మారెడ్డి  కేటీఆర్ పక్కన నుండి లేచి సుఖేందర్ రెడ్డి పక్కన కూర్చొన్నాడు.
హరీష్ రావు కేటీఆర్ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పారు. హరీష్ రావు రాజ్ భవన్‌లోకి వచ్చిన సమయంలో పార్టీ నేతలు, కాబోయే మంత్రులను చిరునవ్వుతూ పలకరించారు. హరీష్, కేటీఆర్ లు ఇద్దరూ పక్క పక్కనే కూర్చోని మంత్రుల ప్రమాణస్వీకారాన్ని తిలకించారు.

టీఆర్‌ఎస్ పార్టీలో సైనికుడిని : హరీశ్‌.

రాజ్‌భవన్‌లో కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర మంత్రివర్గానికి హరీశ్‌రావు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి ఆలోచనలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసి ఈ ప్రభుత్వానికి, కేసీఆర్‌గారికి మంచిపేరు తీసుకొస్తారని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ రోజు గౌరవనీయులు కేసీఆర్‌గారు, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి ప్రజల ఆకాంక్షలను నిజం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు పూర్తిస్థాయిలో మంచిగా పనిచేసి ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉండి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాని తెలిపారు.
ఎన్నికల సమయంలో కూడా చెప్పాను, నేను టీఆర్‌ఎస్ పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేస్తున్నాను. పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికే పదుల సార్లులో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగారు ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాలు, సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. నాకు వారు ఏ భాధ్యత అప్పగించినా క్రమశిక్షణగల కార్యకర్తగా దానిని అమలు చేస్తాను. నాకు అసంతృప్తి ఉండటం కాని అటువంటిది ఏదీ కూడా ఉండదు. ఎవరైనా సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరుమీద ఎటువంటి గ్రూపులు, సేనలు లేవు. ఎవరైనా పెట్టుకుంటే దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని, అందరూ పార్టీ కోసం, సీఎం కేసీఆర్ కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.