సర్పంచిని నేలపై కూర్చోబెట్టడం దారుణం: కేసీఆర్‌

హైదరాబాద్‌: మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచి బాలప్పను నేలపై కూర్చోబెట్టిన ఘటనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలా చేయడం దారుణమని అన్నారు. భవిష్యత్తులో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం పెదిరిపాడు పంచాయతీ కార్యాలయంలో కొందరు పెద్దలు కుర్చీలపై కూర్చొని ‘పంచాయతీ’ చెబుతుంటే, ఊరి ప్రథమ పౌరుడు నేలపై కూర్చుని ఉన్న దృశ్యం పత్రికల్లో ప్రచురితమైన విషయం తెలిసిందే.
కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌ పర్సన్స్‌తో బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలను కలుపుకొని సామూహికంగా గ్రామ వికాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని … గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.