విషాదం… బైక్‌ మీద పడి చిన్నారి మృతి

వర్ధన్నపేట(వరంగల్ రూరల్): ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారిపై ద్విచక్ర వాహనం పడడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండలంలోని శ్రీరామోజు కుమ్మరిగూడెంతండాలో జరిగింది. వివరాల్లోకి వెళితే… తండాకు చెందిన భూక్యా బాలాజీ, కల్పన దంపతుల చిన్న కుమారుడు రుచిత్‌(3) ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయ పొలం వద్దకు తన బాబాయితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్లాడు. అనంతరం బండికి స్టాండ్‌ వేసి రుచిత్‌ను బైక్ వద్దే ఉంచి అతను పొలానికి వెళ్తుండగా కొంత దూరం వెళ్లగానే మోటర్‌సైకిల్‌ స్టాండ్‌ తొలగిపోయి, బైక్‌ రుచిత్‌పై పడిపోవడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం Hb వర్ధన్నపేట సివిల్‌ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్‌ తెలిపారు.